TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో ఓవైపు సిట్.. మరోవైపు ఈడీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కీలక సమాచారం సేకరించాయి. వారి ద్వారా ఇందులో భాగమైన వారందరిపైనా చర్యలు చేపట్టింది. అయితే ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఈనెల 24న వాదనలు జరిగాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తుపై… హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. 24న జరిగిన వాదనల్లో.. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని వాదించిన పిటిషనర్లు CBIకి ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కోణాల్లో.. దర్యాప్తు చేసే సామర్థ్యం సిట్‌కు లేదన్నారు.
అయితే….పిటిషనర్ల వాదనతో ప్రభుత్వ తరపు న్యాయవాది విభేదించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగుతోందని, CBI విచారణ అవసరం లేదన్నారు. సీల్డ్ కవర్‌లో సిట్ సమర్పించిన నివేదికతోపాటు ఇరువర్గాల వాదనలు పరిగణనలోకి తీసుకొని ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.