కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్(రామగుండం)కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఓవైపు పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని.. ఇంకోవైపు చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ లేఖ రాశారని, ఒకదానికొకటి పొంతన లేకపోవడం, ఒప్పందంలోని క్లాజులకు భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం వంటి అంశాలపై వివరణ కోరింది.
బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు నివేదించి తమను తప్పుదోవ పట్టించడానికి బాధ్యులెవరో తేల్చి వివరాలు పంపాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) మురళీధర్ నోటీసుల్లో పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించి రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీలో బ్యాంకు గ్యారంటీలను విడుదల చేసేలా సిఫార్సు చేయించడానికి కారకులెవరో వెంటనే తెలియజేయాలని కోరారు. ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించారంటూ అందులోని నిబంధనలను జత చేసిన ఈఎన్సీ మురళీధర్.. ఈ నెల రెండో తేదీన నోటీసు జారీ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.