రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత మొత్తం లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 525 మంది బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. ఆ 17 స్థానాలకు 625 మంది నామినేషన్లు వేయగా.. వందమంది తమ పత్రాలను ఉపసంహరించుకున్నారని వెల్లడించారు.
అధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది పోటీలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారని వెల్లడించారు. పెద్దపల్లి-42, కరీంనగర్-28, నిజామాబాద్-29, జహీరాబాద్-19….., మెదక్-44, మల్కాజిగిరి-22 మంది పోటీలో నిలిచారని అధికారులు తెలిపారు. హైదరాబాద్-30, చేవెళ్ల-43, మహబూబ్ నగర్-31, నాగర్ కర్నూలు-19, నల్గొండ-22, భువనగిరి-39, వరంగల్-42, మహబూబాబాద్-23, ఖమ్మంలో 35 మంది పోటీ పడుతున్నట్లు వివరించారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతోంది. ఓటర్లను చైతన్యపరిచే నినాదాలతో కూడిన పేపర్ బ్యాగులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికార్యాలయం పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు, ఇతర వాణిజ్య కేంద్రాలు, దుకాణాల్లో ప్రజలకు వీటిని ఉచితంగా అందించనుంది. ఎన్నికల నియమావళిని పాటిస్తూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.