తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఫిబ్రవరి 17న సచివాలయ కొత్త భవనం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సాయంత్రం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. భవనం అంతా కలియతిరిగారు. పనుల పురోగతిపై ఆరా తీసిన సీఎం.. పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేదపండితులు సూచించిన ప్రకారం ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయ భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముందు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.