తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దాదాపు 40 రోజుల తర్వాత ఏకధాటి వాన కురుస్తుండటంతో రాష్ట్ర రైతులతో పాటు ప్రజలు కూడా సంబుర పడుతున్నారు. వాన వల్ల కాస్త ఇబ్బందులు ఎదురైనా.. ఇనాళ్ల వేడి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నామని అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. సీజన్‌లోనే అత్యధికంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 21 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గరిష్ఠంగా 98.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. వానలు పడుతున్నా, ఇంకా వర్షపాతం లోటులోనే ఉంది. ఈ సీజన్‌లో మంగళవారం నాటికి 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 217.1 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది.