భారీ వర్షాలకు తెలంగాణ చిగురుటాకులా వణికిపోతుంది. రాష్ట్రంలో సోమవారం సాయంత్రం కురిసిన వానకు జనజీవనం అస్తవ్యస్తమయింది. దాదాపు గంటపాటు కురిసిన కుండపోత వర్షానికి పల్లెలు.. పట్టణాలు వణికిపోయాయి. సాయంత్రం వాన పడటం వల్ల కార్యాలయాలకు వెళ్లిన వారు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే రాష్ట్రంలో పలుచోట్ల గురువారం దాకా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడ్రోజులు వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఇది మరింత తీవ్రమై బుధవారానికి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆ సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.