నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఓవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడమే గాక.. సరైన వర్షాలు లేక లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలాఖరున కురిసిన భారీ వర్షాల తరువాత చినుకు జాడ లేకపోవడంతోపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా మళ్లీ వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది.
తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ 11 జిల్లాలకు, మంగళవారం 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల వ్యవధిలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేటకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.