నాలుగు రోజులు.. నాలుగంటే నాలుగే రోజుల్లో వానాకాలం లెక్కలన్నీ మారిపోయాయి. అసలే నైరుతి రుతుపవనాలు 15 రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆపై.. రెండు నెలల దాకా వర్షం జాడే లేదు. కానీ అనూహ్యంగా వాతావరణంలో మార్పులు. నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానతో ఒక్కసారిగా వర్షాకాలం లెక్కలన్నీ తారుమారైపోయాయి.
మొన్నటి దాకా ఉన్న లోటు వర్షపాతం కాస్త.. ఇప్పుడు మాయమైపోయింది. ఆ లోటును ఈ నాలుగు రోజుల వర్షాలు పూడ్చేశాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు జూన్ ఒకటి నుంచి ఈ నెల 17 నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం 242.7 మిల్లీమీటర్లకు గాను అంతకన్నా 25 శాతం తక్కువ కురవడంతో 182.1 మి.మీ.లే ఉంది. కానీ శుక్రవారం (జులై 21)కల్లా 311 మి.మీ. నమోదవడంతో రాష్ట్ర సగటు ఏకంగా మైనస్ 25 నుంచి ప్లస్ 15 శాతానికి చేరింది. మొత్తంగా 40 శాతం అదనపు వర్షపాతం నమోదైంది.