ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రధాని రేపు ఉదయం 8గంటల30నిమిషాలకు రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ప్రధాని వెళ్లనున్నారు.
వేములవాడలో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వేములవాడ సభ ముంగించుకుని వరంగల్ కు బయల్దేరి.. బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని హాజరయ్యే సభలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే సభలకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తి కాగా.. జన సమీకరణపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.