గత రెండ్రోజుల క్రితం మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించాయి. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన లక్షల ఎకరాల పంటను నాశనం చేసింది. వేల ఎకరాల్లో మామిడి, నిమ్మ వంటి పంటలను నేలరాల్చింది. వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. రెండ్రోజులుగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఇక వానలు తగ్గినట్లేనని రైతులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొంది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పగటి పూట, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.