రాష్ట్ర వ్యాప్తంగా గత రెండ్రోజుల నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఏకధాటి వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. అయితే రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ.. ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గురువారం వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే వీలుందని వాతావరణ శాఖ పేర్కొంది.