బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ్టికి అల్పపీడనంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా.. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పల్నాడు, తూర్పు గోదావరి, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్) వెబ్‌సైట్ ప్రకారం.. రాత్రి 7 గంటల వరకు గుంటూరు జిల్లా రావెల ప్రాంతంలో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమై.. ముందస్తు చర్యలు చేపట్టింది.