తెలంగాణ భగ్గుమంటోంది. గడిచిన పదేళ్లలో లేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వచ్చేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తరువాత బయటకు రాలేనంత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం రోజున 9 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు నమోదయ్యాయి.
ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతోంది. ఆదివారం నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో, సూర్యాపేట 8, కొత్తగూడెం 3, జనగామ 2, గద్వాల 2, ఖమ్మం 2, మంచిర్యాల 2, సిద్దిపేట 3, యాదాద్రి రెండు మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. ఖమ్మం నగరంలోనూ 5 రోజులుగా సాధారణం కన్నా 5 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రత 32.2- 33 డిగ్రీలకు, రాత్రి ఉష్ణోగ్రత 20.6- 21.1 డిగ్రీలకు పెరిగాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రతల సగటు గడిచిన 30 ఏళ్లలో 3.6 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.