తీవ్రమైన ఎండలతో తెలంగాణ మండిపోతోంది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండ కొడుతోంది. ఆదివారం రోజున ఆరు జిల్లాలు భానుడి తాపానికి అల్లాడాయి.
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొన్నారు. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.