తెలంగాణ రాష్ట్రాన్ని వరణుడు వేధిస్తున్నాడు. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని రైతులకు అతలాకుతలమైపోతున్నారు. చేతికొచ్చిన పంట ఓవైపు పొలంలోనే నేల రాలుతోంది. మరోవైపు కల్లాల్లో.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా నీటిలో కొట్టుకుపోతోంది. ఇప్పటికే కష్టమంతా కొట్టుకుపోయి రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తీసిన వరణుడు ఇవాళ కూ డా కర్షకులకు కష్టం కలిగించేలా ఉన్నాడు.
రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ కారణంగా తెలంగాణలో తేమంతా తరలిపోయి 8వ తేదీ అనంతరం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 5.9 సెం.మీటర్లు, హైదరాబాద్ జిల్లా షేక్‌పేటలో 5.4, రంగారెడ్డి జిల్లా గండిపేటలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.