తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర భార‌తం నుంచి తిరోగ‌మ‌న దారిలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌పై నుంచి చురుగ్గా క‌దులుతున్నాయి. దీనికి తోడు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున స్థిరంగా కొన‌సాగుతోంది. అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయం గుర్తించాలని సూచించారు.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబరు 29, 30) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక అయిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.