గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10 దాటితే భానుడి భగభగలకు భయపడి బయటకు రాలేకపోతున్నారు. ఇక అత్యవసర పనులపై వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకుని బయట అడుగుపెడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కాస్త చల్లబడ్డారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది.
వడగండ్ల వానకు నిజామాబాద్‌లోని ధర్పల్లి మండలంలో వరి ధాన్యం తడవగా.. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, రాజారం, తిమ్మాపూర్‌తోపాటు పలు గ్రామాల్లో పలుచోట్ల మామిడి తోటలో పూత, కాయలు రాలిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్‌లో భారీగా వడగండ్ల వాన కురిసింది. అయితే మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో విలవిలలాడని జనం ఒక్కసారిగా వర్షం కురవడంతో సంబురపడుతున్నారు. అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురుస్తున్నాయని బాధపడుతున్నారు. ఈసారి కూడా పంట నష్టం తప్పదా భగవంతుడా అంటూ బిక్కుబిక్కుమంటున్నారు.