సాధారణంగా తెలుగు వాళ్లు అయి ఉండి కూడా తెలుగు టీచర్ కావడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి తెలుగు అమ్మాయి అయి ఉండి కూడా ఉర్దూ టీచర్ గా ఎంపికైంది. ఆమె పుట్టింది మాత్రం హిందూ కుటుంబంలోనే. ఆమెది తెలంగాణ రాష్ట్రం. తెలుగు కుటుంబంలో పుట్టినప్పటికీ ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకుంది జయశ్రీ.
ఈమె 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టళ్లలో ఉంటూ అక్కడి జెడ్పీ హై స్కూల్ లో చదువుకుంది. ఇంటర్మీడియట్ కూడా బాన్సువాడలో ప్రభుత్వ కాలేజీలో, డిగ్రీ బోధన్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుంది. డిగ్రీ పూర్తయ్యాక.. ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ లో బీఈడీ పూర్తి చేసింది. గత ఏడాది టెట్ రాసి ఎంపికైంది. 2024 డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ సబ్జెక్ట్ కి ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలోనే అద్భుతమైన ప్రతిభ కనబరచడం విశేషం.