తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగలతో అల్లాడిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం పూట ప్రజలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. సూర్యుడి భగభగలతో రాష్ట్రం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ఎండ వేడికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది.
వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 43.1 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఏడాదికి ఇదే రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొన్నారు. మొత్తం 11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకుపైగా నమోదయినట్లు వివరించారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. మధ్యాహ్నం సమయంలో బయటకు పోకపోవడమే మంచిదని, ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్ తప్పనిసరిగా వెంట ఉండేలా చూసుకోవాలని చెప్పారు.