భారతదేశానికి యంగ్ ఇండియా అనే పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే దేశంలో దాదాపు 50 శాతం యువ జనాభా ఉంది కాబట్టి. ప్రపంచంలో యువ జనాభా ఇంత పెద్ద ఎత్తున ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే రానురాను మన దేశంలోనూ యువత తగ్గిపోనుందట. దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందట. ఈ విషయాన్ని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది.
ఇప్పటివరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని పేర్కొంది. ప్రపంచ కార్మిక సమాఖ్య(ఐఎల్‌వో).. ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్’తో కలిసి ‘భారత ఉపాధి నివేదిక-2024’ను తాజాగా విడుదల చేసింది. 2039 నాటికి తెలంగాణలో 15-29 ఏళ్ల యువ జనాభా తగ్గనుందని, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ తగ్గుదల ఎక్కువ అని ఈ నివేదిక వెల్లడించింది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరగనుందని తెలిపింది.