తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు తీసుకువచ్చినా.. వారి ప్రాణాలను కాపాడలేకపోతోంది. అనుకోని విపత్తులు.. పంటలకు పట్టిన చీడలు.. వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి చేస్తున్న అప్పులు రైతులను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉంటున్నారు.
తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికులు కౌలుదారులేనని రైతు స్వరాజ్యవేదిక నివేదిక వెల్లడించింది. 2014 నుంచి 2022 వరకు 800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే అందులో 75 నుంచి 80 శాతం మంది కౌలు రైతులేనని తన అధ్యయనంలో తేలిందని తెలిపింది.
‘2022 మే, జూన్ నెలల్లో 34 గ్రామాల్లోని 7744 మంది రైతులను సర్వేచేస్తే అందులో 2753 (35.6శాతం) మంది కౌలుదారులని తేలింది. వీరిలో 97.3 శాతం మందికి రైతు బంధు, ఇతర పథకాలు అందడం లేదు. కౌలు రైతుల్లో ప్రతి ఒక్కరికీ సగటున రూ.2.7 లక్షల వరకు రుణం ఉంది. అందులో రూ.2 లక్షలు ప్రైవేటు రుణాలే. ప్రైవేటు అప్పులపై 24 శాతం నుంచి 60 శాతం వరకు వడ్డీ ఉంది.’ అని ఈ నివేదిక వెల్లడించింది.