హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణ సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అయితే అమావాస్య కావడంతో బాలుడిని నరబలి ఇచ్చారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
అదే ప్రాంతంలో ఉంటున్న హిజ్రా.. ఆ బాలుడిని నరబలి ఇచ్చారని ఆరోపిస్తూ అతని ఇంటిపై బాలుడి బంధువులతో పాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. నరబలి అంటూ వచ్చిన వార్తలపై స్పందించారు.
డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “బాలుడు మిస్ కాగానే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలింపు మొదలుపెట్టాం. ఆ తర్వాత బాలుడిని చంపేసినట్లుగా గుర్తించాం. ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ బాలుడిని హత్య చేసి ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో పడేశారు. ఆర్థిక గొడవలతోనే ట్రాన్స్ జెండర్ ఇమ్రాన్ హత్య చేసింది. ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ ఇమ్రాన్ పరారీలో ఉంది” అని వివరించారు డీసీపీ.