బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆ రెండే కారణాలు : కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రెండు కారణాల చేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రుణమాఫీ విషయంలో రోజుకో మాట చెబుతోందని మండిపడ్డారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు.. వారు నియామకపత్రాలు ఇచ్చి వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని సీరియస్ అయ్యారు. సొంత డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని విమర్శించారు. పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని తెలిపారు. ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్ళు గుడికట్టి ఓట్లడుగుతున్నారని, అలాగైతే మనం కూడా యాదాద్రి ఆలయం కట్టామని అన్నారు. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలంటే.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news