ఓ బ్యూటీ పార్లర్ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. అందం కోసం ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తనని మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నించిన ఓల్డ్ సిటీకి చెందిన మహిళ ప్రయత్నం విఫలం కావడం భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. పొడుగ్గా ఉన్న తన జుట్టుని కట్ చేయించుకోవడానికి అబిడ్స్ ఏరియాలోని ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది ఆ మహిళ. అక్కడి బ్యూటీషియన్ ఆమె జుట్టుకు ఏదో ఆయిల్ పెట్టి హెయిర్ కట్ చేసింది.
అయితే ఆ ఆయిల్ పెట్టిన కాసేపటికే జుట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. కొద్దిసేపటికే తలపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోవడంతో ఆ మహిళ ఇంటికి పరుగులు పెట్టింది. ఇక భార్య నెత్తిన జుట్టు లేకపోవడం చూసిన ఆ భర్త ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం బాధితురాలు తన ఊడిపోయిన జుట్టు పట్టుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.