హైదరాబాద్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఆగంతకుడు హల్ చల్ సృష్టించాడు. తనకు బంగారం వద్దంటూ డబ్బే కావాలంటూ జూబ్లీహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు ఆరు గంటలకు పైగా ఇంట్లో కలకలం రేపాడు. అంతే కాకుండా రూ.10లక్షలతో ఉడాయించాడు.
అసలేం జరిగిందంటే.. ఎన్‌ఎస్‌ఎన్ రాజు అనే వ్యాపారి తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తెతో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లో నివసిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముఖానికి నల్ల ముసుగు ధరించిన ఆగంతుకుడు నిచ్చెన సాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడి నుంచి కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న రాజు కుమార్తె నవ్య వద్దకు వెళ్లి నిద్రలేపి మెడ మీద కత్తి పెట్టాడు. భయపడవద్దంటూ.. తనకు డబ్బులు కావాలంటూ అడిగాడు. ఆమె ఒంటిపై ఉన్న వజ్రాల చెవిదిద్దులు, దాదాపు అరకిలో బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పినా వినలేదు. రూ.20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.
ఉదయం 9.30గంటలవుతున్నా కుమార్తె గదిలో నుంచి బయటకు రాలేదని తల్లి లీల వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. కుమార్తె మెడపై కత్తి పెట్టి ఉన్న ఆగంతుకుడిని చూసి ఆందోళనకు గురయ్యారు. లీలను గదిలో ఒక పక్కన కూర్చోబెట్టిన దుండగుడు డబ్బులు కావాలని చెప్పడంతో రూ.2లక్షలు ఇచ్చారు. మరో రూ.8 లక్షలు నవ్య భర్త ఏవీ మనీష్‌రెడ్డి తన స్నేహితుడికి ఇచ్చి ఉదయం 10 గంటల ప్రాంతంలో పంపించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నవ్య ఫోన్ నుంచి షాద్‌నగర్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకొని ఆగంతుకుడు వెళ్లిపోయాడు.