గత ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని.. రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు కోరారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు ఇస్తే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో మీడియాతో వీహెచ్ మాట్లాడారు. టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న కురియన్ కమిటీ తొలుత ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును కలవాలన్నారు.
“టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుడైన హైదరాబాదీ సిరాజు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. దేశంలో క్రికెట్కు మంచి క్రేజ్ ఉంది. తెలంగాణలో క్రీడలను సీఎం ప్రోత్సహించాలి. రాష్ట్రంలో హైదరాబాద్లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదు. ఏపీలో 12 ఉన్నాయి. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి 12 ఎకరాల స్థలాన్ని సీఎం కేటాయించాలి. గతంలో క్రీడలను కేటీఆర్ ప్రోత్సహించలేదు.. ఎకరం భూమి కూడా కేటాయించలేదు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు” అని వీహెచ్ తెలిపారు.