తెలంగాణ రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్తు లభ్యత, తక్షణ అవసరాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14000 మెగా వాట్ల నుంచి 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్తు అధికారులు అంచనా వేశారు.