సోషల్ మీడియా ద్వారా నన్ను బద్నాం చేయాలని కొందరు చూస్తున్నారని, అయినా నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరయ్యాయని, వాటిని న్యాయబద్దంగా అర్హులకు పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం లక్ష్మీ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొన్నం మాట్లాడారు.
తాగు, సాగు నీటి సమస్యలు ఎక్కడ వచ్చినా నాకు సమాచారం ఇవ్వాలని మంత్రి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరారు. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు సమకూరుస్తుందని చెప్పారు. కొత్త బోర్లు వేయడంతోపాటు ట్యాంకర్లు పెట్టి నీటిని సరఫరా చేస్తామన్నారు. శనిగరం ప్రాజెక్ట్ ద్వారా నీటి విడుదలను కొనసాగించాలని అధికారులను ఆదేశించమని చెప్పారు. కోహెడ మండలానికి శాశ్వత సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, అలాగే బోనస్లు ఇస్తామని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే.. ఊరుకునేది లేదని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.