మంగళవారం ఖమ్మం పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరూ బిఆర్ఎస్ నాయకులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ నాయకుల పై దాడి చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. వరద బాధితుల గురించి ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేయడం దారుణమని మండిపడ్డారు.
మంగళవారం రోజు ఖమ్మం నగరం బొక్కల గడ్డలో కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని.. వరద బాధితులను పరామర్శించేందుకు తాను, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వెళ్ళామన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు అక్కడే ఉండడంతో మమ్మల్ని చూసి వారు నినాదాలు చేయడం మొదలుపెట్టారని.. అలా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర నినాదాలు చేస్తూ అధికాస్తా గొడవకు దారి తీయడంతో రాళ్లు రువ్వుకున్నారని చెప్పుకొచ్చారు.
వారి వల్లే గొడవ జరిగిందన్నారు. నన్ను చంపాలని చూశారు. నన్ను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా.? అని ప్రశ్నించారు. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని.. ఖమ్మం జిల్లా మంత్రులకు వాయిస్ లేదన్నారు. అసలు మున్నేరుకు వరద ఎక్కడ నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా..? అని ప్రశ్నించారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.