భద్రాచలం వద్ద టెన్షన్ టెన్షన్.. 53.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

-

భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో శనివారం మధ్యాహ్నం 53 అడుగుల స్థాయిని దాటింది. దీంతో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద నీరు 53.2 అడుగులకు చేరుకుంది. మూడో హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. అయితే వరద ప్రవాహం నిన్నటి కంటే కాస్త తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.

మరోవైపు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కరకట్ట పక్కనే ఉండే స్థానిక కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లోకి నీరు చేరడంతో 200 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ నెల 23న మొదటిసారి నది నీటి మట్టం అత్యధికంగా 50.90 అడుగులకు చేరుకుంది. 24 నుంచి క్రమంగా తగ్గింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news