దిల్లీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. వరద బీభత్సంలో దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓల్డ్ రాజిందర్‌నగర్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు.
భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరింది. కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోని లైబ్రరీలో చదువుకుంటుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తుకు రావడంతో అక్కడున్న వారికి ఏం అర్థంకాలేదు. క్షణాల్లోనే ముంచెత్తిన వరద ధాటికి నీటమునిగి ఇద్దరు యువతులు, యువకుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించాయి. నీటిని బయటకు పంపి సహాయక చర్యలు సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు దిల్లీ మంత్రి అతిశీ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని తెలిపారు.