టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కి వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు, క్షణికావేశంలో బిజెపిలో చేరిన వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిదని, ఎవరైనా పార్టీలోకి రావచ్చని వెల్లడించారు.
తనని తిట్టినా పట్టించుకోనని.. ఎవరికైనా తన వల్ల ఇబ్బంది ఉంటే తాను ప్రజల కోసం, పార్టీ కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. తన వల్ల ఇబ్బంది ఉంటే సీనియర్ నేతలతో మాట్లాడుకోవచ్చని.. వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, జూపల్లి ఇలా అందరూ కేసీఆర్ కి వ్యతిరేకంగా ఏకం కావలసి ఉందన్నారు. తెలంగాణ అభ్యున్నతి కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడిని కాదని.. సోనియా గాంధీ, ఖర్గేలే నాయకులని అన్నారు.