జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచిన ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనునున్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను నినాదంతో 2017 నుంచి జీఎస్టీని కేంద్రం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పెట్రోల్, మద్యం మినహా దాదాపు అన్నింటిని జీఎస్టీలోకి తీసుకువచ్చింది. దీంతో తమకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందంటూ రాష్ట్రాలు ఆందోళనలు చేయడంతో ఐదేళ్ల వరకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి ఏడాది, అంతకు ముందు ఏడాది వచ్చిన జీఎస్టీ రాబడుల మొత్తంతో బేరీజు వేసి.. దానికి కంటే 14శాతం అదనంగా చేర్చి ఒక బెంచ్ మార్కును నిర్ణయిస్తుంది. ఆ మొత్తం కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లయితే ఆ లోటును జీఎస్టీ పరిహారం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లిస్తోంది.
అయితే.. కరోనా వైరస్ ప్రభావం జీఎస్టీ రాబడులపై పడగా.. ఆదాయం చాలా వరకు తగ్గింది. రాష్ట్రాలు తమకు రావాల్సిన పరిహారం అంశంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన 41వ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారంపై రెండు ప్రతిపాదనలు రాష్ట్రాల ముందు ఉంచింది. మొదటి ప్రతిపాదనలో రూ.97వేల కోట్లుగా అంచనా వేయగా.. ఈ మొత్తాన్ని కేంద్రం ఆర్బీఐ ద్వారా రుణంగా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తుంది. అసలు, వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది. రెండో ప్రతిపాదనలో కరోనాతో నష్టపోయిన జీఎస్టీ రూ.2.37లక్షల కోట్ల రుణాల ద్వారా సమకూర్చనుంది. ఇందులో అసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీని రాష్ట్రాలు చెల్లించుకోవాలని చెప్పింది. ఈ కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.