కాపీ కొట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన నాయకుడు లేడని అంటారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలోనూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజకీయాలను కాపీ కొడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి విపక్ష నాయకుడు జగన్ ఏం ప్రచారం చేస్తే.. ఎలాంటి వాగ్దానాలు చేస్తే.. వాటిని వెంటనే అమలు చేసేవారు చంద్రబాబు. ఆయన చెప్పాడు.. నేను చేసి చూపిస్తున్నాను.. అని చెప్పుకొనేవారు. దీంతో కాపీల బాబుగా అప్పట్లో వైఎస్సార్ సీపీ నాయకులు తెగ ప్రచారం చేసేవారు. ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై కుల ముద్ర వేసింది. కమ్మ వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన సామాజిక వర్గాలను బాబు తొక్కేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే అప్పట్లో చంద్రబాబు ప్రబుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తే.. వీరంతా కమ్మ వర్గానికి చెందిన వారేనంటూ.. నేరుగా అప్పటి విపక్ష నేత జగన్ ఢిల్లీలో కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆతర్వాత తనకు చెందని పార్టీ నేతలను కూడా జగన్ తనవైపు తిప్పుకొని.. టీడీపీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలతోనే చంద్రబాబుపై విమర్శలు చేయించారు. రెడ్లకు చంద్రబాబు చేసింది ఏమీలేదని తీవ్ర విమర్శలు చేయించారు. దీంతో ఆయన వ్యూహం బాగానే వర్కవుట్ అయింది.
ఇక, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నేరుగా ఇదే ఫార్ములాను కాపీ కొట్టినట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే.. జగన్ సర్కారుపై కమ్మ వ్యతిరేకత ముద్ర వేసేందుకు ఆయన అప్పట్లో జగన్ వేసిన స్కెచ్నే కాపీ కొట్టారని అంటున్నారు. తాజాగా వివాదరహితుడు.. రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న బుచ్చయ్య చౌదరిని లైన్‌లో పెట్టడం వెనుక కేవలం జగన్‌ను ఓ కులానికి చెందిన ముఖ్యమంత్రిగానే ప్రొజెక్ట్ చేయడం ద్వారా సక్సెస్ అవ్వాలనే బాబు వ్యూహం ఉందని అంటున్నారు. అయితే, ఈ విషయంలోనూ బాబు తప్పులో కాలేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కులం అనేది సెంటిమెంట్‌కు సంబంధించిన విషయం. ఇది ఎక్కువ కాలం ఉండదు. కాబట్టే.. జగన్ ఎన్నికలకు ముందు చేసిన ప్రచారం వర్కవుట్ అయింది. కానీ, ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. చంద్రబాబు ఇలా ప్రచారం చేయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజలు కూడా చర్చించుకునేందుకు సమయం ఉందని, అప్పట్లో సమయం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదీ సంగతి..!!