ఇవాళ తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల హడావిడి తెలంగాణలో పూర్తయిన నేపథ్యంలో… పాలనపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగానే ఇవాళ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ తరుణంలో పలు కీలక అంశాలపై చర్చించేందుకుగాను తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలు, రుణమాఫీ, ధరణి సమస్యలు, ధాన్యం కొనుగోలు, బ్యారేజీల మరమ్మత్తులు అలాగే విద్య సంస్థల ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి అంశాలపై చర్చించనుంది రేవంత్ రెడ్డి కేబినెట్. ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఆగస్టు 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.