గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తున్న టమాట ధర ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రైతు బజార్లలో టమాట ధర కిలో రూ.63 ఉంది. ఇక బయట మార్కెట్లలో మాత్రం రూ.120 నుంతి రూ.140 ధర పలుకుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి టమాట రాక పెరుగుతుండటంతో రైతు బజార్లలో ధర పడిపోతోంది.
నగరానికి 10 రోజుల కిందట కేవలం 850 క్వింటాళ్ల సరకు వస్తే.. సోమవారం 2450 క్వింటాళ్లు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి నగరానికి దిగుబడి వస్తోంది. మరోవైపు.. రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా ఎక్కువ మొత్తంలో రావడమే ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు కిలో రూ.50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. అయితే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కిలో మొదటి రకం టమాటా రూ. 63గా నిర్ధారించి బోర్డులు రైతుబజార్లలో పెట్టినా అక్కడ శాశ్వత దుకాణదారులు కిలో రూ.100కు తగ్గకుండా అమ్ముతున్నారు.