కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో సీఎం కేసీఆర్‌…!

-

ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్యే గంప గోవర్దన్ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారం నిజమేనేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోటీచేయాలని కోరినట్లు గంప గోవర్ధన్ పేర్కొనడంతో ఇప్పుడు మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ నియోజకవర్గంలోనే ఉండడంతో మరింతగా చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ.. కేసీఆర్ బాల్యంలో బీబీపేట మండలం కోనాపూర్‌లో నివసించారు. ఎగువ మానేరు నిర్మాణ సమయంలో సాగు భూములు ముంపునకు గురవడంతో సిద్దిపేట మండలం చింతమడకకు వలస వెళ్లారు. కామారెడ్డి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ ఉన్నారు. గంపతో పాటు జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నిట్టు వేణులు ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలోనే కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాలపైనా కేసీఆర్ ప్రభావం ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news