తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత నెలలో కిలో టమాట ధర కూ.3 నుంచి రూ.10 పలకగా ఇప్పుడు ఏకంగా రూ.100 పలుకుతోంది. కూరగాయల్లో ప్రధానమైన టమాట ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యాసంగి ముగిసిన తర్వాత కొత్తగా వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో.. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల ప్రభావం, తెగుళ్లు, చీడ పీడలు ఆశించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లో రేట్లు పెరిగాయి.
రాష్ట్రంలోని సికింద్రాబాద్ బోయినపల్లి టోకు మార్కెట్‌లో కిలో టమాట ధర 72 రూపాయలు పలికింది. హైదరాబాద్ జంట నగరాల్లో రైతు బజార్లలో బోర్డు రేటు 75 రూపాయలుగా నిర్ణయించారు. రైతు బజారులో వ్యాపారులు, రైతులు కిలో టమాట ధర 90 నుంచి 100 చొప్పున విక్రయించడంతో కిలో కొనాలనుకున్నా.. ధరను చూసి అరకిలో, కిలోన్నరకే పరిమితం అవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో మొన్నటి దాక రూ.3 నుంచి రూ.5 పలకిన ధర ఇప్పుడు ఏకంగా రూ.100కు చేరుకోవడంతో ప్రజుల ఇబ్బందులు పడుతున్నారు. టమాటనే కాదు…పచ్చిమిరపకాయ, సోయాచిక్కుడు, గింజ చిక్కుడు వంటి కూరగాయలు కిలో 100కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.