ఎడిట్ నోట్: కేసీఆర్ టార్గెట్‌గా మోదీ..ఎందుకు?

-

కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న బి‌జే‌పికి చెక్ పెట్టేందుకు దేశంలోని విపక్షాలు ఏకమయ్యే దిశగా వెళుతున్నాయి. ఇప్పటికే పాట్నా వేదికగా విపక్షాల ఐక్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విపక్షాలు ఐక్యంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఈ విపక్షాల సభపై తాజాగా ప్రధాని మోదీ విమర్శలు చేశారు.

భోపాల్ వేదికగా జరిగిన బి‌జే‌పి బూత్ లెవెల్ నేతల, కార్యకర్తల సమావేశంలో..విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ కుటుంబం బాగుండాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి అని, ములాయంసింగ్ కుమారుడు బాగుండాలంటే సమాజ్‌వాద్ పార్టీకి ఓటేయండి అని, అలాగే కరుణా నిధి, లాలుప్రసాద్ ఫ్యామిలీల గురించి మాట్లాడారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్ గురించి కూడా కామెంట్ చేశారు. కే‌సి‌ఆర్ కుమార్తె బాగుండాలంటే బి‌ఆర్‌ఎస్‌కు ఓటేయండి అని..అదే మీ పిల్లల భవిష్యత్ బాగుండాలన్న, దేశం బాగుండాలన్న బి‌జే‌పికి ఓటు వేయాలని అన్నారు.

అయితే బి‌జే‌పికి ఓటు వేయండి అని చెప్పడానికి మిగిలిన విపక్ష పార్టీలని విమర్శించారు. కానీ విపక్ష పార్టీలతో కే‌సి‌ఆర్ కలిసి లేరు. ఇటీవల పాట్నా సమావేశానికి కూడా కే‌సి‌ఆర్ హాజరు కాలేదు. అలాంటప్పుడు మోదీ..కే‌సి‌ఆర్‌ని కూడా ఎందుకు టార్గెట్ చేశారంటే? దానికి పలు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక కోణంలో చూస్తే..దేశంలో కే‌సి‌ఆర్ ప్రభావం పెరిగిందని, ఆయన్ని నిలువరించడానికి ఇలా టార్గెట్ చేశారనే కథనాలు వస్తున్నాయి. అలాగే తెలంగాణలో కే‌సి‌ఆర్‌కు చెక్ పెట్టి అక్కడ బి‌జే‌పి బలం పెంచడానికి అలా చెప్పి ఉంటారని కొందరు అంటున్నారు.

ఇక మరో కోణంలో చూస్తే..దేశంలో విపక్షాల బలం పెరుగుతుంది..ఈ క్రమంలో విపక్షం రూపంలోనే ఉంటూ..ఓట్లు చీల్చి బి‌జే‌పికి లబ్ది చేకూర్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లోనే బి‌ఆర్‌ఎస్ ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక అందుకే బి‌ఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఇంకా హైలైట్ చేస్తే. ఆ పార్టీ బలం పెరుగుతుంది..ఇంకా పెద్ద ఎత్తున విపక్షాల ఓట్లు చీల్చి బి‌జే‌పికి మేలు చేస్తుందనే కారణం కూడా చెబుతున్నారు. కారణం ఏదైనా గాని కే‌సి‌ఆర్‌ని మోదీ టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news