హైదరాబాద్ వ్యాప్తంగా మొహర్రం పండుగ జరుగుతోంది. ముఖ్యంగా పాతబస్తీలో ముస్లిం సోదరులు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. మొహర్రం ఊరేగింపుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మొహర్రం ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలతో పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని.. వాహనదారులు ఆంక్షలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఇవాళ మధ్యాహ్నం డబీర్పుర బీబీ కా ఆలం నుంచి మొహర్రం ఊరేగింపు మొదలు కానుంది. యకత్పురా, సర్దార్ మహల్, చార్మినార్, గులార్ హౌజ్, పురాణ హవేలీ, ఇమిలీబన్ బస్టాండ్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మొహర్రం ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.