రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 అయిన తర్వాత ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక ఉదయం పదింటికే ఇంట్లో కూలర్లు, ఏసీలు ఆన్ చేసుకుంటున్నారు. ఉక్కపోత భరించలేక అల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్తున్నారు. మధ్యాహ్నం పూట చాలా వరకు ఎవరూ ఇంటి నుంచి కదలడం లేదు. ఎక్కడికైనా వెళ్లాలన్నా ఉదయం 10 గంటల కంటే ముందు సాయంత్రం 4 గంటల తర్వాత బయల్దేరుతున్నారు.
ఎండల ప్రభావం, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావం… గ్రేటర్ హైదరాబాద్లోని సిటీ ఆర్టీసీ బస్సులపై పడింది. ఎండల కారణంగా ప్రయాణికులు మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో గ్రేటర్లో సిటీ బస్సులను తగ్గించాలని నిర్ణయించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తక్కువ సంఖ్యలో బస్ సర్వీస్లను నడుపుతామని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటల వరకు… బస్సులను తిరిగి యధావిధిగా తిరుగుతాయని వెల్లడించారు. ఈనెల 17వ తేదీ నుంచి మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్య తగ్గించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.