తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గా నిర్మిస్తున్న ఆస్పత్రుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. కొత్తగా నిర్మించే ఆస్పత్రులకు అవసరం అయ్యే నిధులను బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థల నుంచి తీసుకురావడంతో పాటు ఇతర పనుల కోసం ఈ ప్రత్యేక కార్పొరేషన్ పని చేయనుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్సిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ( TSSHCL ) అని పేరు ను కూడా పెట్టింది.
ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈ కార్పొరేషన్ ముఖ్యంగా.. వరంగల్ కొత్తగా నిర్మించనున్న అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్సిటల్ తో పాటు హైదరాబాద్ మహా నగరంలో నాలుగు స్పెషాలిటీ హాస్సిటల్స్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించనున్న ఆస్పత్రులకు, వైద్య కాలేజీలకు అవసరమైన నిధులను సమకూర్చుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యం నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని స్థాయిల్లో నిర్మాణాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ కార్పొరేషన్ పని చేయనుంది.