చాలా కాలం తర్వాత పసుపు ధరలు పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపుకు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ధర లభించింది. గురువారం రోజున నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి మార్కెట్‌కు 38 క్వింటాళ్ల పసుపు పంట తెచ్చారు. కమీషన్ ఏజెంటు హన్మంత్‌రావు అండ్ కంపెనీ కొమ్ముకు క్వింటాకు రూ.10,116 ధర చెల్లించి కొనుగోలు చేశారు.
ఇదే రైతు తీసుకొచ్చిన పసుపు మండ రకానికి క్వింటాకు రూ.9,211 లభించింది. గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన కొనుగోళ్లు ఏప్రిల్ వరకు కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ఠ ధర రూ.7,800 లోపే పలికింది. తాజాగా రూ.10,116 ధర పలకడం విశేషం. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సుమారు 55 వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32 వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది. పసుపు ధర పెరగడం పట్ల రైతు హర్షం వ్యక్తం చేశాడు.