తెలంగాణలో అయోమయంలో నిరుద్యోగులు.. గ్రూప్ 2 పరీక్ష జరిగేనా ?

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కాస్త అయోమయంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ ల కారణంగా పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అందులో గ్రూపు 2 కూడా ఒకటి. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను జనవరి 06, 07 తేదీలలో నిర్వహించనున్నట్టు TSPSC ఇటీవలే ప్రకటించింది. అయితే జనవరి 06, 07 తేదీల్లో గ్రూపు 2 ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారు.

వాస్తవానికి డిసెంబర్ 29, 2022న TSPSC గ్రూపు 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 18, 2023 నుంచి ఫిబ్రవరి 16, 2023 దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొత్తం 783 పోస్టులకు 5,51,943 దరఖాస్తులు చేసుకున్నారు. TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలను ఇప్పటివరకు రెండు, మూడు సార్లు  సవరించింది. తొలుత TSPSC గ్రూప్ 2 పరీక్ష ఆగష్టు 29 నుంచి 30, 2023 వరకు జరగాల్సి ఉంది. కానీ పేపర్ లీకేజీ కారణంగా  దీనిని నవంబర్ 02 మరియు 03, 2023 తేదీల్లో నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేశారు.

మరోవైపు  ఎన్నికల కారణంగా కమిషన్ TSPSC గ్రూప్-2 పరీక్ష తేదీలను మళ్లీ సవరించింది. కొత్తగా TSPSC గ్రూప్-2 పరీక్ష తేదీలు జనవరి 06 మరియు 07, 2024 జరుగనున్నాయని వెల్లడించింది. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పలు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రూపు 2 పరీక్ష జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది నిరుద్యోగులు గ్రూపు 2 పరీక్షను రెండు నెలలు వాయిదా వేస్తే.. చదువుకునేందుకు వీలుగా ఉంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. TSPSC గ్రూపు 2 ఎగ్జామ్ ని వాయిదా వేస్తుందా..? లేక జనవరి 06, 07 తేదీలలోనే నిర్వహిస్తుందా అని అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ స్పందించి గ్రూపు 2 అభ్యర్థులకు ఓ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు నిరుద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news