నిరాహార దీక్ష విరమించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. నిరుద్యోగల సమస్యలపై బీజేపీ 24 గంటల నిరాహారదీక్ష ఎట్టకేలకు ముగిసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరాహారదీక్షను విరమించారు. జాతీయ నేత ప్రకాశ్‌ జావడేకర్‌.. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

అంతకుముందు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డికి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం రోజున ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డిని సాయంత్రం 6 గంటల సమయంలో చుట్టుముట్టి బలవంతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌ రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే ఈటల సహా పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈటల అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని.. తాము అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news