కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహబూబ్‌నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రికి వంశీ లేఖ రాశారు. ప్రజలను మోసం చేసి కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని విమర్శించారు. పోటీకి రండి.. ఎవరు చెప్పేది నిజమో.. ప్రజలే తేల్చుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వల్లే కృష్ణా నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. పాలమూరులో గత ప్రభుత్వ బండారం బయటపెడతామని తెలిపారు.
“ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుంది. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేసారు. రాష్ట్ర ప్రజలను వంచించి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదు. ఆయన అసమర్థ నాయకత్వంతో కృష్ణా నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టింది. మరోసారి మోసం చేయడానికే ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు.’’ అని వంశీచంద్‌రెడ్డి అన్నారు.