సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. వర్షాకాలం మొదలవగానే తగ్గుతుంటాయి. కానీ, ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నా.. వర్షాకాలం మొదలయ్యాక అమాంతం పెరిగాయి. ప్రస్తుతం కూరగాయలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి రైతు బజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30% నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి.
మే 20న కిలో ఉల్లి ధర రూ.20 ఉండగా ఇప్పుడది రూ.40కి చేరింది. టమాటా జూన్ ఆరంభంలో రూ.25 ఉంటే ప్రస్తుతం రూ.50కి చేరింది. వంకాయ రూ.40, పచ్చిమిర్చి కిలోకి రూ.80 అయింది. బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాలతోపాటు పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కూడా ధరలు పెరగడానికి ఓ కారణమని వ్యాపారులు అంటున్నారు.