వర్షం ఎఫెక్ట్.. ఇళ్లు కదలని ప్రజలు.. గిరాకీ లేక పూలన్నీ వరదలో పడేస్తున్న వ్యాపారులు

-

హైదరాబాద్​లో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెల్లవారు జాము నుంచి ఎడ తెరిపిలేని వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు.

రెండ్రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. చిరు వ్యాపారులకు నష్టాలు మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు.. చిన్న చిన్న టిఫిన్ బండ్లు పెట్టుకుని జీవనాధారం గడుపుకునే వారికి వర్షాలు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పువ్వులు కొనేందుకు ఎవరూ రాకపోవడంతో… హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్లో పూల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరాకీ లేక… పువ్వులను నీటిలో పడేస్తున్నారు. పది రూపాయలు కిలో చామంతి పూలు ఇస్తున్న తీసుకునేవారు లేరని రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకీ పెద్ద మొత్తంలో మార్కెట్ కు పువ్వులు వస్తున్నాయని… కానీ వాటిని కొనేందుకు ఎవరు రాకపోవడంతో… వాటిని నీటిపాలు చేయక తప్పడం లేదని రైతులు, చిరు వ్యాపారులు వాపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news