అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని బయటపెడతామని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారంలోకి రాగానే కాళేశ్వరం, మిషన్ భగీరథ, పశుసంవర్థక శాఖ ఇలా పలు శాఖల్లో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మిషన్ భగీరథ పథకం నిర్మాణ పనులపై దృష్టి సారించింది. ఈ పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి.
తొలుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనుల తీరును విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పరిశీలిస్తోంది. ఆ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనలో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా విచారణను రాష్ట్రమంతటికీ విస్తరింపజేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజిలెన్స్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వైస్ ఛైర్మన్‌గా ఇదే జిల్లాలోని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవహరించిన నేపథ్యంలో విజిలెన్స్ అదే జిల్లాను విచారణకు ఎంచుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.7 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా విచారణకు ప్రాధాన్యం సంతరించుకొంది.