రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలుకు మరో కొత్త స్టాప్ను యాడ్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 25వ తేదీ (ఆదివారం) నుంచి వందే భారత్ రైలు ఏలూరులో కూడా ఆగుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు వందే భారత్ రైలుకు విజయవాడ- రాజమహేంద్రవరం మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదన్న విషయం తెలిసిందే.
దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులకు మొరపెట్టుకోగా తాజాగా దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఏలూరులో అదనపు స్టాప్ ఏర్పాటు చేయడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి 9.49 గంటలకు ఏలూరు చేరుకుంటుంది. 9.50కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు వందేభారత్ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయలుదేరి సాయంత్రం 17.54 గంటలకు ఏలూరు స్టేషన్‌కు చేరుకుని 17.55కి బయలుదేరుతుంది.